Huzurabad: హుజూరాబాద్, బద్వేలు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
- హుజూరాబాద్ ఫలితంపై సర్వత్ర ఉత్కంఠ
- ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే అనుకూలం
- లెక్కింపు కేంద్రం వద్ద భారీ బందోబస్తు
- సాయంత్రానికి హుజూరాబాద్, మధ్యాహ్నానికి బద్వేలు తుది ఫలితం
తెలంగాణలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలుకు రెండు రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరో రెండు గంటల్లో పోలింగ్ సరళి తెలిసిపోనుండగా, మధ్యాహ్నం నాటికి గెలుపుపై స్పష్టమైన అంచనా రానుంది. బద్వేలుతో పోలిస్తే హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కేసీఆర్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసి అవినీతి ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి సీఎంకు సవాలు విసరడమే అందుకు కారణం.
పోలింగ్ తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని చెప్పడం కూడా ఫలితాలపై ఆసక్తిని పెంచాయి. అయితే, సాధారణ ప్రజాభిప్రాయం మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అనుకూలంగా ఉంది. కాగా, ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, హుజూరాబాద్‌లో 753, బద్వేలులో 235 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. తొలుత వీటిని లెక్కించిన తర్వాత ఈవీఎంలను లెక్కించనున్నారు. 22 రౌండ్లలో హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. 9.30 గంటలకు హుజూరాబాద్‌లో తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇక, బద్వేలులో నాలుగు హాళ్లలో లెక్కింపు ప్రారంభమైంది. ఒక్కో దాంట్లో పది రౌండ్లలో లెక్కింపు జరగనుంది. కొన్నింటిలో గరిష్ఠంగా 12 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. హుజూరాబాద్ బరిలో మాత్రం 30 మంది అభ్యర్థులు ఉండడంతో సాయంత్రానికి తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.