Kodali Nani: ఆ విషయంలో పవన్ కల్యాణ్ ను అభినందిస్తున్నా: కొడాలి నాని
- విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా ఉద్యమం చేయడానికి ముందుకొచ్చారు
- వైసీపీ ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ విధించడం హాస్యాస్పదం
- జనసేన ఒక చచ్చిపోయిన పార్టీ
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి విమర్శలు గుప్పించారు. వీరిద్దరికీ భయపడేవారు ఎవరూ లేరని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయడానికి పవన్ కల్యాణ్ ఇప్పటికైనా ముందుకొచ్చారని... ఈ విషయంలో ఆయనను అభినందిస్తున్నానని చెప్పారు.
అయితే, విశాఖ స్టీల్ ప్లాంటుపై వైసీపీ ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ విధించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. జనసేన అనేది ఒక చనిపోయిన పార్టీ అని... అలాంటి పార్టీ తమకు డెడ్ లైన్లు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. చచ్చిపోయిన పార్టీ డెడ్ లైన్లు కాక ఏం పెడుతుందని అన్నారు. మీకు అంత దమ్ముంటే ఢిల్లీకి వెళ్లి డెడ్ లైన్లు పెట్టాలని వ్యాఖ్యానించారు. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఒక్క చోట కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు.