China: తైవాన్ ఆక్రమణకు రెడీ అవుతున్న చైనా.. నిత్యావసర సరుకులు నిల్వ చేసుకోవాలంటూ పౌరులకు ఆదేశాలు!
- అమెరికా హెచ్చరికలు బేఖాతరు
- అక్టోబరులో ఏకంగా 200 యుద్ధవిమానాల తరలింపు
- తాజా ఆదేశాలు అందుకోసం కాదంటున్న మరికొందరు
- ఆహార కొరత నేపథ్యంలోనే తాజా ఆదేశాలంటున్న ఇంకొందరు
డ్రాగన్ కంట్రీ చైనా చర్యలు చూస్తుంటే తైవాన్ ఆక్రమణకు సిద్దమవుతున్నట్టుగానే ఉంది. తైవాన్ జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమంటూ అమెరికా హెచ్చరించినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని కమ్యూనిస్ట్ కంట్రీ.. తైవాన్ ఆక్రమణ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రజలందరూ నిత్యావసర సరుకులను కొంతమేరకు నిల్వ చేసుకోవాలంటూ ఆ దేశ వాణిజ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేయడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. యుద్ధ సమయంలో పరిస్థితులను ఎదురొడ్డే ఉద్దేశంతోనే చైనా ఈ ప్రకటన చేసినట్టు చెబుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం దీనిని కొట్టిపడేస్తున్నారు. దేశంలో ఆహార కొరత ఉత్పన్నమయ్యే అవకాశం ఉండడంతోనే ఈ ప్రకటన చేసినట్టు చెబుతున్నారు.
అక్టోబరు నెలలో చైనా 200 యుద్ధ విమానాలను తైవాన్‌కు తరలించినట్టు వార్తలు వచ్చాయి. ఆ నెల చివరి రోజైన ఆదివారం ఆ దేశ ఆర్మీ ఎనిమిది వై-8 యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ విమానాలు, ఆరు జె-16 ఫైటర్ జెట్లు, ఒక కేజే-500 ఎర్లీ వార్నింగ్ విమానాన్ని తైవాన్ స్వయం ప్రకటిత నైరుతి వాయు రక్షణ ఐడెంటిఫికేషన్ జోన్‌కు తరలించింది.
అంతేకాదు, వై-8 యాంటీ సబ్‌మెరైన్ విమానం బాషీ చానల్ మీదుగా ద్వీప దేశంలో చక్కర్లు కూడా కొట్టింది. తాజా పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్న వారు తైవాన్ ఆక్రమణకు చైనా సిద్ధమవుతున్నట్టే ఉందని చెబుతున్నారు. చైనా ప్రధాన భూభాగానికి ఆగ్నేయ తీరంలో ఉన్న తైవాన్ ఓ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ 24 మిలియన్ల మంది జనాభా నివసిస్తున్నారు.