Congress: కాంగ్రెస్ సమావేశానికి వచ్చి మధ్యలోనే వెళ్లిపోయిన జానారెడ్డి.. వెళ్తూ వెళ్తూ ఆసక్తికర వ్యాఖ్యలు
- వాడీవేడీగా పీఏసీ సమావేశం
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి గైర్హాజరు
- సమావేశానికి రాకపోతే.. రాలేదని అంటారని వచ్చానన్న జానారెడ్డి
- తన అవసరం ఉన్నప్పుడే వస్తానంటూ వెళ్లిన వైనం
తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు, పార్టీ పరిస్థితిపై చర్చించడానికి ఈ రోజు హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది. ఊహించినట్లుగానే ఈ సమావేశం చాలా వాడీవేడిగా కొనసాగుతోంది.
ఇక ఈ సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. వెళ్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారి సమావేశానికి తానిక రానని, తన అవసరం ఉన్నప్పుడే వస్తానంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను ఈ సమావేశానికి హాజరుకాకపోతే, తాను రాలేదని అంటారని, ఆ మాట పడకూడదనే వచ్చి వెళ్తున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని లక్ష్యం చేసుకుని పార్టీ కీలక నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, వారిద్దరూ ఈ సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. ఈ సమావేశానికి హాజరై, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తానని నిన్న జగ్గారెడ్డి తెలిపారు. అయినప్పటికీ ఆయన రాలేదు.