Vinisha Uma Shankar: మిమ్మల్ని చూస్తుంటే కోపమొస్తోంది.. ప్రపంచ వేదికపై దేశాధినేతలకు 14 ఏళ్ల భారత అమ్మాయి చురకలు

Vinisha Uma Shankar A 14 Year Old Indian Girl Questions World Leaders On Their Efforts On Climate Protection

  • కాప్ 26 సదస్సులో తమిళనాడు టీనేజర్ వినీశా ఉమాశంకర్ ప్రసంగం
  • మీ వాగ్దానాలతో మా తరం విసిగిపోయింది
  • మాటలు చాలు.. చేతల్లో చూపించండి
  • నేను భారత బిడ్డనే కాదు.. ధరిత్రీ పుత్రికను

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వంటి మహామహులున్న వేదిక అది. ఓ 14 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. వేదికపై మైకు అందుకుని మాట్లాడడం మొదలుపెట్టింది. ‘‘నేను కేవలం భారత్ బిడ్డనే కాదు.. ఈ ధరిత్రీ పుత్రికను. అందుకు నేను గర్విస్తున్నాను’’ అంటూ మొదలు పెట్టింది. ‘‘మీ శుష్క వాగ్దానాలు వినీవినీ విసిగొచ్చేస్తోంది.. మిమ్మల్ని చూస్తే కోపం వస్తోంది.. కానీ, నాకు అంత సమయం లేదు. చేతల్లోనే చేయాలి. ఇక మీరు చెప్పింది చాలు.. చేతల్లో చూపించండి’’ అంటూ ప్రపంచాధినేతలకు భయం..బెరుకు లేకుండా సూటిగా చెప్పేసింది ఆ అమ్మాయి.


ఆ అమ్మాయి పేరు వినీశా ఉమాశంకర్. తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లా ఆమె ఊరు. స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో నిర్వహిస్తున్న కాప్ 26 సదస్సులో ఆమె పాల్గొంది. క్లీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ అనే అంశంపై ఉద్విగ్న భరితమైన ప్రసంగం ఇచ్చింది. బ్రిటన్ యువరాజు విలియమ్స్ ఆహ్వానం మేరకు ఆమె అక్కడి వరకు వెళ్లి ప్రపంచ వేదికపై తన గళాన్ని వినిపించింది.

‘‘ప్రపంచ నేతలు చేస్తున్న ఉత్తుత్తి హామీలు విని మా తరం విసుగెత్తిపోతోంది. ఆ ఉత్తి హామీలను ఆపేయండి. పర్యావరణాన్ని రక్షించి భూమిని కాపాడండి. పాత చర్చలపై అనవసర ఆలోచనలను మానండి. నవ భవిష్యత్ కోసం నవ దృక్పథం ఎంతో అవసరం. కాబట్టి మీరు మీ సమయాన్ని, డబ్బును, ప్రయత్నాలను మా లాంటి ‘ఎర్త్ షాట్ ప్రైజ్’ విన్నర్లు, ఫైనలిస్టుల ఆవిష్కరణలపై ఇన్వెస్ట్ చేయండి. శిలాజ ఇంధనాలు, పొగ, కాలుష్యం వంటి వాటి వల్ల నిర్మితమవుతున్న ఆర్థిక వ్యవస్థపై కాదు’’ అంటూ చురకలంటించింది.

తమతో పాటు ప్రపంచ నేతలు కలిసి నడవాలని, స్వచ్ఛ ఇంధనాలను రూపొందించాల్సిన అవసరం ఉందని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. పాతకాలపు ఆలోచనలు, అలవాట్లను వదులుకోవాలని సూచించింది. తాము పిలిచినప్పుడు మీరొచ్చినా..రాకున్నా.. తామే ముందుండి ఆ బాధ్యతను తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రపంచ నేతలు ఆలస్యం చేసినా తాము రంగంలోకి దిగుతామని పేర్కొంది. తమ భవిష్యత్తును తామే కాపాడుకుంటామని తేల్చి చెప్పింది.


ఎవరీ అమ్మాయి?.. ఏంటీ ఎర్త్ షాట్


తమిళనాడుకు చెందిన వినీశా ఉమాశంకర్.. 12 ఏళ్ల వయసులోనే మంచి ఆవిష్కరణ చేసింది. బొగ్గుల పెట్టెతో ఇస్త్రీ చేస్తున్న వ్యక్తులను గమనించింది. దాని వల్ల కాలుష్యం కలుగుతుందని, పర్యావరణానికి నష్టమని ఆలోచించిన ఆమె.. దానికి ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలనుకుంది. ఈ క్రమంలోనే సౌర విద్యుత్ తో పనిచేసే ఇస్త్రీ బండిని రూపొందించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రిన్స్ విలియమ్స్ ఏర్పాటు చేసిన ఎర్త్ షాట్ ప్రైజ్ పోటీల్లో ఆమె ఈ ఏడాది ఫైనల్ దాకా వెళ్లింది.

కాగా, ఐదు విభాగాల్లో ఎర్త్ షాట్ పోటీలను నిర్వహిస్తుంటారు. ఇంకో విశేషమేంటంటే ఈ బహుమతిని 2019లో ప్రకటించినా ఈ ఏడాదే తొలి బహుమతిని ప్రదానం చేయడం. 1. ప్రకృతి రక్షణ, పునరుద్ధరణ, 2. స్వచ్ఛమైన గాలి, 3. సముద్రాల పునరుత్తేజం, 4. వ్యర్థ రహిత జీవనం, 5. పర్యావరణ పరిరక్షణ చర్యల వంటి విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News