Sameer Wankhede: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ బాధ్యతల నుంచి సమీర్ వాంఖడే తొలగింపు

NCB removes Sameer Wankhede from Aryan Khan drugs case probe
  • ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
  • ప్రత్యేక బృందానికి విచారణ బాధ్యతలు
  • ఎన్సీబీ రీజనల్ డైరెక్టర్ గా కొనసాగనున్న వాంఖడే
  • ఇది ఆరంభం మాత్రమేనన్న మంత్రి నవాబ్ మాలిక్
దేశంలో తీవ్ర చర్చకు దారితీసిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతల నుంచి సమీర్ వాంఖడేను తొలగించారు. ఈ మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. సమీర్ వాంఖడేపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ కేసు విచారణ జరుపుతున్న వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు.

వాంఖడేను తప్పించిన నేపథ్యంలో ఇకపై ఎన్సీబీకి చెందిన ప్రత్యేక బృందం ఆర్యన్ ఖాన్ వ్యవహారంతో సంబంధం ఉన్న 5 కేసుల విచారణ కొనసాగించనుంది. ఈ మేరకు ఎన్సీబీ స్పెషల్ టీమ్ కు అధికారాలు బదలాయించారు. ఈ నేపథ్యంలో సమీర్ వాంఖడే ఎప్పట్లాగానే ఎన్సీబీ ముంబయి విభాగానికి జోనల్ డైరెక్టర్ గా కొనసాగనున్నారు.

దీనిపై మంత్రి నవాబ్ మాలిక్ స్పందిస్తూ, ఇది ఆరంభం మాత్రమేనని, 26 కేసుల్లో నిగ్గుతేలాల్సి ఉందని అన్నారు. ఆర్యన్ ఖాన్ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సాయిల్ అనే వ్యక్తి ఇటీవల సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ ను తప్పించేందుకు సమీర్ వాంఖడే నుంచి రూ.25 కోట్లకు డిమాండ్ వచ్చిందని ప్రభాకర్ వెల్లడించాడు. ఈ మేరకు ప్రభాకర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది.
Sameer Wankhede
Aryan Khan Drugs Case
Probe
NCB
Mumbai
Maharashtra

More Telugu News