Bollywood: సమీర్ వాంఖడే స్థానంలో సంజయ్ కుమార్ సింగ్.. ఆర్యన్ ఖాన్ కేసులో ఇక అసలు నిజాలు వెలుగులోకి వస్తాయా?
- సమర్థుడైన అధికారిగా గుర్తింపు
- 1996 బ్యాచ్ ఒడిశా కేడర్ అధికారి
- ఒడిశాలో డ్రగ్ ముఠాల ఆట కట్టించిన సంజయ్
- జనవరిలో ఎన్సీబీలో చేరిక
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కేసులో నిన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తున్న సమీర్ వాంఖడేను తొలగించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ సింగ్‌ను ప్రభుత్వం నియమించింది. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి అయిన సంజయ్ కుమార్ ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు సారథ్యం వహిస్తారు. వాంఖడే స్థానంలో సంజయ్‌ను నియమించడంపై సర్వత్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఆయన ఎవరో తెలుసుకోవాలన్న ఉత్సుకత అందరిలోనూ నెలకొంది.
సంజయ్ కుమార్ సింగ్ 1996 బ్యాచ్‌కు చెందిన ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి. ఒడిశా పోలీస్, సీబీఐలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఎన్సీబీలో చేరడానికి ముందు కుమార్ సింగ్ ఒడిశా డ్రగ్ టాస్క్ ఫోర్స్ (డీటీఎఫ్)లో అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా పనిచేశారు. ఆయన హయాంలో రాష్ట్రంలో వరుస యాంటీ డ్రగ్ డ్రైవ్‌లు జరిగాయి. భువనేశ్వర్‌లో పలు డ్రగ్ రాకెట్ల ఆట కట్టించారు. 2008 నుంచి 2015 వరకు సీబీఐలో డీఐజీగా పనిచేశారు. ఆ సమయంలో పలు హై ప్రొఫైల్ కేసులను పర్యవేక్షించారు.
సంజయ్ కుమార్ సింగ్ ఒడిశా పోలీస్ ఐజీపీగా, జంట నగరాల అదనపు కమిషనర్‌గా పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర దర్యాప్తు సంస్థకు డిప్యూటేషన్‌పై వెళ్లిన సంజయ్ .. ఎన్సీబీలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ)గా చేరారు. ఆయనపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు కానీ, క్రిమినల్ కేసులు కానీ పెండింగులో లేవని అలాగే, అవినీతి కేసులు కూడా లేవని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.