kodela shiva: కోడెల శివరామ్ సహా పలువురు టీడీపీ నేతల గృహ నిర్బంధం
- గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజక వర్గంలో ఘటన
- చంద్ర ఆశయ సాధన పేరుతో ఈ రోజు పాదయాత్ర
- అనుమతులు లేవన్న పోలీసులు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజక వర్గంలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చంద్ర ఆశయ సాధన పేరుతో ఈ రోజు యాత్ర చేపట్టడానికి టీడీపీ నేత కోడెల శివరామ్ ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు అప్రమత్తమై నిర్బంధాలు చేశారు. కోడెల శివరామ్‌ను కూడా గృహ నిర్బంధం చేశారు.
ఆయన రాజుపాలెం నుంచి దేవరంపాడు వరకు పాదయాత్ర చేయాలనుకున్నారు. అందుకు అనుమతులు లేవని పోలీసులు చెప్పారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా, అలాగే, టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోకుండా ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. శివరాంను పోలీసులు బయటకు రానినివ్వడంలేదు. సత్తెనపల్లిలోని ఇతర టీడీపీ నేతల ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు.
ప్రజా సమస్యలపై తాము ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా వైసీపీ నేతలు తమను అణచివేయాలని చూస్తున్నారని కోడెల శివరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా తిరుగుబాటును అడ్డుకోలేరని అన్నారు. తన తండ్రి కోడెల శివ ప్రసాద్ పట్టుబట్టి రహదారి విస్తరణ పనులు మంజూరు చేయించారని ఆయన చెప్పారు వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నప్పటికీ పేరేచర్ల-కొండమోడు రహదారి విస్తరణ పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు.