Bollywood: ఆర్యన్‌ఖాన్ అమాయకుడు, డ్రగ్స్ కేసులో ఇరికించారు: సంచలన విషయాలు వెల్లడించిన సాక్షి విజయ్ పగారే
- డబ్బులు దోచుకునేందుకు ముందస్తు పథకం ప్రకారమే దాడి
- న్యూస్ క్లిప్‌లోని దృశ్యాలు చూసిన తర్వాత స్పష్టత
- డబ్బులు అందుకున్నాక గోసావి పరారయ్యాడు
- ‘బడా కామ్ హోగయా’ అనడం నేను విన్నాను
- హోటల్ ఫార్చ్యూన్లోనే కుట్ర
రోజుకో మలుపు తిరుగుతున్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో తాజాగా ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం సంచలనం సృష్టించింది. ఈ కేసులో పట్టుబడిన ఆర్యన్‌ఖాన్ అమాయకుడని, అతడిని ఈ కేసులో ఇరికించారని ముంబై పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఇచ్చిన వాంగ్మూలంలో సాక్షి విజయ్ పగారే పేర్కొన్నారు. ముందస్తు పథకం ప్రకారమే అక్టోబరు 2న క్రూయిజ్ నౌకపై దాడి జరిగిందని అన్నారు.
డబ్బుల కోసం కొందరు వ్యక్తులు ఆర్యన్‌ను ఇరికించారని తెలిపారు. తనకు రావాల్సిన బాకీ సొమ్మును రాబట్టేందుకు గత కొన్ని నెలలుగా సునీల్ పాటిల్‌తో కలిసి ఉంటున్నానని, ఈ సందర్భంగా ఆర్యన్‌ఖాన్‌ను దోచుకుని, విషయం బయటపడిన తర్వాత కేసులు పెట్టడాన్ని తాను చూశానని విజయ్ పగారే తెలిపారు. సునీల్ పాటిల్ ఈ కేసులో ప్రధాన సూత్రధారని, ఎన్సీపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మహారాష్ట్ర బీజేపీ నేత మోహిత్ కాంబోజ్ చేసిన ఆరోపణలతో సునీల్ పేరు వెలుగులోకి వచ్చింది.
ఎవరీ విజయ్ పగారే?
సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన విజయ్ ధూలేకి చెందిన వారు. 2018లో ఓ పని నిమిత్తం సునీల్ పాటిల్‌కు కొంత సొమ్ము ఇచ్చారు. అయితే, ఆ పని చేయకపోగా, తీసుకున్న డబ్బులను కూడా వెనక్కి ఇవ్వలేదు. దీంతో డబ్బులు వసూలు చేసుకునేందుకు వచ్చిన విజయ్.. సునీల్ ఎక్కడికి వెళ్లినా వెంట వెళ్లేవారు. అలా అహ్మదాబాద్, సూరత్, ముంబైలోని లలిత్, ఫార్చ్యూన్ హోటళ్లకు వెళ్లారు. సెప్టెంబరు 27 నుంచి సునీల్ నవీ ముంబైలోని ఫార్చ్యూన్ హోటల్లో ఉంటున్నట్టు విజయ్ తెలిపారు. కేపీ గోసావి పేరుపై ఆ రూము బుక్ అయిందని పేర్కొన్నారు.
క్రూయిజ్ నౌకపై దాడికి కొన్ని రోజుల ముందు ఆ హోటల్లో బీజేపీకి చెందిన సాక్షి మనీష్ భానుషాలి, కేపీ గోసావి, సునీల్ పాటిల్ కలుసుకున్నారని విజయ్ తెలిపారు. సునీల్ పాటిల్‌ను మనీష్ భానుషాలి ముద్దు పెట్టుకున్నప్పుడు తాను హోటల్ రూములోనే ఉన్నట్టు చెప్పారు. సునీల్ పాటిల్‌ను ముద్దుపెట్టుకున్న తర్వాత ‘బడా కామ్ హో గయా’ (పెద్ద పని అయిపోయింది) అని మనీష్ చెప్పారని, మనం ఇప్పుడు అహ్మదాబాద్ వెళ్లిపోతున్నామని, పగారేను మాత్రం వెంట తీసుకెళ్లొద్దని చెప్పడం విన్నానని వివరించారు. అయితే, అప్పుడు ఏం జరుగుతోందో తనకు అర్థం కాలేదని అన్నారు.
అక్టోబరు 3న మనీష్ భానుషాలి నవీ ముంబైలోని హోటల్ గదికి తిరిగొచ్చి విజయ్ పగారేను కలుసుకున్నాడు. డబ్బులు ఇస్తానని, తన వెంట రావాలని కోరాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. దారిలో మనీష్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ పూజా, శామ్, మయూర్ సహా కొందరి పేర్లను తీసుకున్నారని విజయ్ వివరించారు. కేపీ గోసావి ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండడంతో డబ్బులు అందుకున్న తర్వాత పరారై ఉంటాడని అనుమానించినట్టు చెప్పారు.
అనంతరం ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత అక్కడ పెద్ద ఎత్తున మీడియా మోహరించి ఉండడాన్ని తాను చూశానని, ఆర్యన్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్సీబీ చెప్పిదని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత క్రూయిజ్ పార్టీపై దాడి దృశ్యాలకు సంబంధించిన ఓ న్యూస్ క్లిప్‌లో మనీశ్ భానుషాలి, కేపీ గోసావి నిందితులను ఎస్కార్ట్ చేస్తున్నట్టు ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ దాడి ముందస్తు పథకం ప్రకారమే జరిగిందని తనకు అర్థమైందని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో విజయ్ పగారే స్పష్టం చేశారు.
విషయం తనకు స్పష్టంగా అర్థమైన తర్వాత కోర్టులో ఆర్యన్ తరపున వాదిస్తున్న న్యాయవాది సతీష్ మానేషిండేను కలిసి తనకు తెలిసిన విషయాలను చెప్పేందుకు ప్రయత్నించానని, అయితే సతీష్ తనను పట్టించుకోలేదని అన్నారు.