Nara Lokesh: వైసీపీ రచ్చకు లేని నిబంధనలు.. అమరావతి రైతుల పాదయాత్రకే అడ్డమా.. పోలీసులపై లోకేశ్ మండిపాటు
- వైసీపీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారంటూ ఆగ్రహం
- అడ్డంకులు సృష్టిస్తే ఉద్యమం ఆగదని కామెంట్
- మరింత ఉద్ధృతమవుతుందని హెచ్చరిక
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. రాజధాని కోసం మహిళలు, రైతులు చేస్తున్న పాదయాత్రకు పోలీసులు అడ్డు చెప్పడాన్ని ఆయన విమర్శించారు. వైసీపీ నేతలు రచ్చ చేసేందుకు అడ్డురాని నిబంధనలు కేవలం అమరావతి రైతుల పాదయాత్రకే అడ్డొచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా నిబంధనలు, స్పీకర్లు పాదయాత్రకే అడ్డంకిగా మారాయా? అని మండిపడ్డారు.
నడిరోడ్డుపై అధికార పార్టీ నేతలు రచ్చ చేస్తున్నప్పుడు పోలీసులు ఎందుకు అడ్డుకోవడంలేదని నిలదీశారు. వైసీపీ కార్యకర్తలకు పోలీసులు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకు నోటీసులివ్వడమే పోలీసుల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణచేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యమం ఆగదన్నారు. యాత్రను అడ్డుకోవాలని చూస్తే.. మరింత ఉద్ధృతం అవుతుందని లోకేశ్ హెచ్చరించారు.