Imran Khan: పాకిస్థాన్ ఆటగాళ్ల బాధను నేను అర్థం చేసుకోగలను: ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- టీ20 వరల్డ్ కప్ నుంచి పాక్ నిష్క్రమణ
- ఆస్ట్రేలియాతో సెమీస్ లో ఓటమి
- ఇలాంటి పరిస్థితులను తానూ ఎదుర్కొన్నానన్న ఇమ్రాన్
- నాణ్యమైన క్రికెట్ ఆడారంటూ అభినందనలు
టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ జట్టు అనూహ్యరీతిలో నిష్క్రమించడం తెలిసిందే. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు ఓటమి కోరల నుంచి గట్టెక్కి ఏకంగా మ్యాచ్ లో గెలుపును సొంతం చేసుకుంది. వికెట్ కీపర్ మాథ్యూవేడ్, ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ వీరోచిత ఆటతీరుతో ఆస్ట్రేలియాను ఫైనల్ చేర్చారు. వేడ్ విన్నింగ్ షాట్ కొట్టిన అనంతరం ఆస్ట్రేలియా శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తగా, మైదానంలో పాక్ ఆటగాళ్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. తమ క్రికెట్ జట్టుకు ప్రత్యేక సందేశం పంపారు. "నేను క్రికెటర్ గా ఉన్నప్పుడు ఇలాంటి తీవ్ర నిరాశామయ పరిస్థితులను మైదానంలో ఎన్నో ఎదుర్కొన్నాను. ఇప్పుడు మీరు ఎలాంటి వేదనాభరిత పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోగలను. అయితే ఈ టోర్నీలో మీరు ప్రదర్శించిన నాణ్యమైన క్రికెట్ పట్ల గర్వించాలి. విజయాల పట్ల మీరు పొంగిపోకుండా ఒదిగి ఉన్న తీరు అభినందనీయం" అని పేర్కొన్నారు. అంతేకాదు, సెమీస్ లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు.