Mallu Ravi: ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్ కొత్త డ్రామా ప్రారంభించారు: మల్లు రవి
- వరి పంటను కొనే విషయంలో రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారు
- వరి విషయంలో భయపడాల్సిన అవసరం లేదని గతంలో కేసీఆర్ చెప్పారు
- వరి వేయవద్దని ఇప్పుడు చెపుతున్నారు
రైతుల నుంచి వరి పంటను కొనే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త డ్రామా మొదలు పెట్టారని అన్నారు.
రైతులు పండించిన పంటను ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి, రైస్ మిల్లర్లకు సరఫరా చేసి, ఎఫ్సీఐకి లెవీ పెట్టి, కేంద్ర ప్రభుత్వం నుంచి రీఎంబర్స్ మెంట్ ద్వారా డబ్బులు తీసుకునే విధానం ఉందని చెప్పారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వ చేతికానితనం వల్ల అది జరగలేదని అన్నారు. వరి పంట విషయంలో భయపడాల్సిన అవసరం లేదని గతంలో శాసనసభలో చెప్పిన కేసీఆర్... మొన్నటి సమావేశంలో వరి వేయొద్దని చెప్పారని... ఇది ఆయన రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని చెప్పారు.
రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీ ధర్నాలు చేయడం సరికాదని మల్లు రవి అన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి తక్షణమే రైతులను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా పరిష్కరించుకోవాలని... దాన్ని వదిలేసి ఇలా ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.