Radha Nair: కుమారుడితో కలిసి పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించిన అలనాటి అందాల నటి రాధ
- దక్షిణాదిలో ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందిన రాధ
- 1991లో పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి
- తాజాగా పద్మనాభస్వామి ఆలయ సందర్శన
- మంత్రిపై ప్రశంసలు
దక్షిణాది చిత్ర పరిశ్రమలో 80వ దశకంలో తన అందచందాలు, నటనా ప్రతిభతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటీమణుల్లో రాధ ఒకరు. అప్పట్లో డ్యాన్స్ లో మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ ను అందుకోగల సత్తా రాధకు మాత్రమే ఉండేదనడంలో అతిశయోక్తి లేదు. కేరళ భామ రాధ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించి అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. ఇక 1991లో వ్యాపారవేత్త రాజశేఖరన్ నాయర్ ను పెళ్లాడిన తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించలేదు.
తాజాగా రాధ తన కుమారుడు విఘ్నేశ్ తో కలిసి కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. అదే సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చిన కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ను కలిశారు. పరిపాలన తీరుతెన్నులపై కాసేపు ముచ్చటించినట్టు రాధ ట్విట్టర్ లో వెల్లడించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రిపై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. ఎంతో సానుకూల దృక్పథం, అద్భుతమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. మంత్రిని కలిసినప్పటి ఫొటోలను కూడా రాధ పంచుకున్నారు.