Kurnool District: 60 ఏళ్ల తర్వాత కర్నూలు జిల్లా లక్కసాగరం పంచాయతీకి ఎన్నికలు
- లక్కసాగరం పంచాయతీ ఆవిర్భావం నుంచి ఏకగ్రీవమే
- సర్పంచ్ పదవి కోసం తొలిసారి రెండు వర్గాల పోటీ
- 858 ఓట్ల తేడాతో విజయం సాధించిన వరలక్ష్మి
కర్నూలు జిల్లాలో ఓ గ్రామానికి ఆరు దశాబ్దాల తర్వాత తొలిసారి నిన్న పంచాయతీ ఎన్నిక జరిగింది. జిల్లాలోని కృష్ణగిరి మండలం లక్కసాగరం పంచాయతీకి తొలిసారి రెండు వర్గాలు పోటీ పడ్డాయి. దీంతో ఎన్నిక అనివార్యమైంది. లక్కసాగరం పంచాయతీ ఆవిర్భావం నుంచి ఎన్నికలు జరగలేదు. ఈ పంచాయతీ ఎవరికి రిజర్వు అయినా ఇప్పటి వరకు గ్రామస్థులందరూ కలిసి ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. గ్రామంలో 2,375 మంది ఓటర్లు ఉన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో లక్ష్మీదేవి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఆమె మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో గత సంప్రదాయానికి భిన్నంగా సర్పంచ్ పదవి కోసం రెండు వర్గాలు పోటీ పడ్డాయి. దీంతో నిన్న జరిగిన ఎన్నికలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి వర్గానికి చెందిన ఎం.వరలక్ష్మి 858 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.