Saurabh Kirpal: జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని కొలీజియం సంచలన నిర్ణయం.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా స్వలింగ సంపర్కుడు!
- సీనియర్ న్యాయవాది సౌరభ్ పేరును సిఫార్సు చేసిన కొలీజయం
- గతంలో నాలుగుసార్లు సౌరభ్ పేరును పరిగణనలోకి తీసుకున్నా లేని నియామకం
- ఆయన జీవిత భాగస్వామి విదేశీ అని హెచ్చరించిన ఇంటెలిజెన్స్
- నియామకానికి కేంద్రం ఆమోదిస్తే రికార్డ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి పలు కీలక నిర్ణయాలతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ తాజాగా చేసిన సిఫార్సు సంచలనమైంది. తాను స్వలింగ సంపర్కుడినని గతంలో బహిరంగంగా ప్రకటించుకున్న సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజయం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేసింది.
గతంలో 2017, 2018, 2019 జనవరి, ఏప్రిల్ నెలల్లో సౌరభ్ పేరును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఆచరణలోకి రాలేదు. కేంద్ర నిఘా విభాగం ఆయనను స్వలింగ సంపర్కుడిగా ప్రస్తావించకుండా, ఆయన జీవిత భాగస్వామి విదేశానికి చెందిన వ్యక్తని, స్విస్ రాయబార కార్యాలయంలో పనిచేస్తుండడంతో ఆయన నియామకం దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఫలితంగా సౌరభ్ సీనియర్ న్యాయవాదిగానే ఉండిపోయారు. తాజాగా, జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఆయనను హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫారసు చేసింది. దీనికి కనుక కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి స్వలింగ సంపర్క వ్యక్తిగా సౌరభ్ కిర్పాల్ రికార్డులకు ఎక్కుతారు.