Jai Bhim: నటుడు సూర్య క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు.. ఆ డిమాండ్ అర్థరహితం: కాట్రగడ్డ ప్రసాద్
- ‘వన్నియార్’ వర్గాన్ని అవమానించేలా సినిమాలోని సీన్లు ఉన్నాయన్న రాందాస్
- క్షమాపణలు చెప్పాలని డిమాండ్
- వివాదం ముగిసిందన్న కాట్రగడ్డ ప్రసాద్
- సినిమాలు, రాజకీయాలు వేర్వేరన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని సూచన
పీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ‘వన్నియార్’ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి రాందాస్ డిమాండ్ మేరకు నటుడు సూర్య క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని దక్షిణాది చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ అన్నారు. సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమాలోని సన్నివేశాలు ‘వన్నియార్లు’ అనే వర్గాన్ని అవమానించేలా ఉన్నాయని రాందాస్ ఇటీవల ఆరోపించారు. సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వన్నియార్ సంఘం అభ్యంతరాలపై స్పందించిన సూర్య ఆ లోగోను తొలగించారని, దీంతో ఈ వివాదం ముగిసిందని అన్నారు. అయినప్పటికీ సూర్య నుంచి క్షమాపణలు డిమాండ్ చేయడం అర్థరహితమన్నారు. రాందాస్ తమ డిమాండ్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. సూర్య సినిమాల విషయంలో రాజకీయాలు వద్దని, పేదలు, గిరిజనులకు సూర్య ఎంతో చేశారని అన్నారు. రాజకీయాలు, సినిమాలు వేర్వేరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ప్రసాద్ సూచించారు.