China: బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌పై అమెరికా సంచలన నిర్ణయం!
- వింటర్ ఒలింపిక్స్ దౌత్య బహిష్కరణ యోచన
- ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పిన బైడెన్
- చైనా హక్కుల ఉల్లంఘనకు నిరసనగానే
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనా రాజధాని బీజింగ్‌లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌పై అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ గేమ్స్ దౌత్య బహిష్కరణపై యోచిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. అమెరికా అథ్లెట్లపై ఎలాంటి ప్రభావం పడకుండా చైనాలోని ఉయ్‌ఘుర్ ముస్లిం హక్కుల ఉల్లంఘనపై మరింత కఠినంగా వ్యవహరించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
శ్వేతసౌధంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన బైడెన్ ‘మేం పరిశీలిస్తున్నాం’ అంటూ వింటర్ ఒలింపిక్స్ దౌత్యబహిష్కరణ గురించి వెల్లడించారు. గత సోమవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్- బైడెన్ మధ్య జరిగిన వీడియో సదస్సులో స్థిరత్వాన్ని, విభేదాలను నిరోధించాలని నిర్ణయించారు. అంతలోనే బైడెన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.