Nakka Anand Babu: వివేకా హత్యపై రేపటి నుంచి ప్రతి గ్రామంలో చర్చ పెడతాం: నక్కా ఆనందబాబు
- ప్రతి వైసీపీ నాయకుడు కుప్పం గురించి మాట్లాడుతున్నాడు
- జగన్ మెప్పు పొందేందుకు చంద్రబాబును విమర్శిస్తున్నారు
- వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది
రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదని వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని... ఇది సరికాదని టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. వైసీపీకి చెందిన ప్రతి నాయకుడు కుప్పం గురించి మాట్లాడుతున్నారని... జగన్ మెప్పు పొందేందుకు పోటీలు పడి చంద్రబాబును విమర్శిస్తున్నారని అన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కుప్పంలో మూడు నెలలు ఉండి ఒక్కో ఓటుకు రూ. 10 వేల చొప్పున పంచారని ఆరోపించారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పారు.
వైయస్ వివేకా హత్య కేసులో వాస్తవాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయని... వీటిపై చర్చ జరగాలని ఆనందబాబు అన్నారు. రేపటి నుంచి దీనిపై గ్రామ స్థాయిలో చర్చ పెడతామని చెప్పారు. చంద్రబాబుతో కంటతడి పెట్టించారని... ఆయన కంటతడి రాష్ట్రానికి అరిష్టమని అన్నారు. వైసీపీ ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా టీడీపీ కార్యకర్తలు మనోస్థైర్యాన్ని కోల్పోరని... తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని చెప్పారు.