South Central Railway: తడ-సూళ్లూరుపేట మార్గంలో ప్రమాదకర స్థాయిలో వరదనీరు.. పలు రైళ్ల రద్దు
- ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు
- 12 రైళ్లు దారి మళ్లింపు
- చెన్నై నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల రద్దు
భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అతలాకుతలం అవుతుండడంతో అటువైపుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. నెల్లూరు జిల్లా తడ-సూళ్లూరుపేట మధ్య వరదనీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
తిరుపతి-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-ముంబై సీఎస్‌టీ, గుంతకల్-రేణిగుంట, బిట్రగుంట-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ - బిట్రగుంట, విజయవాడ-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-విజయవాడ రైళ్లను నేడు రద్దు చేశారు. అలాగే, చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్, కాచిగూడ-చెంగల్పట్టు, ఎల్‌టీటీ ముంబై-చెన్నై సెంట్రల్, సీఎస్‌టీ ముంబై-నాగర్‌సోల్, మధురై-ఎల్‌టీటీ ముంబై, చెంగల్పట్టు-కాచిగూడ, చెన్నై సెంట్రల్-ఎల్‌టీటీ ముంబై రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
అలాగే, త్రివేండ్రం-షాలిమర్, తిరుపతి-హెచ్.నిజాముద్దీన్, కాచిగూడ-మంగళూరు, చెన్నై సెంట్రల్-హౌరా, చెన్నై సెంట్రల్-విజయవాడ తదితర 12 రైళ్లను దారి మళ్లించారు.