Andhra Pradesh: పెద్దమ్మపై నిందలేయడనికి నోరెలా వచ్చిందో.. తాత, నానమ్మ సమాధి వద్ద నారా రోహిత్ నిరసన.. ఇదిగో వీడియో
- వైసీపీ నేతలపై మండిపాటు
- పెద్దమ్మ సేవే పరమావధిగా ఉన్నారన్న రోహిత్
- ఎన్నడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని కామెంట్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు కామెంట్లు చేయడం పట్ల నారా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత నారా ఖర్జూర నాయుడు, అమ్మణమ్మ సమాధుల వద్ద ఆయన మౌన నిరసన తెలిపారు. ఆ తర్వాత మాట్లాడారు. పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు లోకేశ్ క్రమశిక్షణకు మారుపేరన్నారు.
పెద్దమ్మ భువనేశ్వరి సేవా కార్యక్రమాలే పరమావధిగా పనిచేస్తున్నారని, అలాంటి మహోన్మతమైన వ్యక్తిపై అన్నన్ని నిందలు వేయడానికి వైసీపీ నేతలకు నోరెలా వచ్చిందని మండిపడ్డారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పట్నుంచి ఇప్పటిదాకా నందమూరి కుటుంబంలోని మహిళలు ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. ఏనాడూ అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. ముఖ్యమంత్రి సతీమణి హోదాలో కూడా పెద్దమ్మ భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో కలుగజేసుకోలేదని గుర్తు చేశారు.