TRS: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే!
- ఇటీవల నోటిఫికేషన్
- డిసెంబరు 10న ఎన్నికలు
- ఈ నెల 23న నామినేషన్ల దాఖలుకు తుదిగడువు
- 12 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడడం తెలిసిందే. డిసెంబరు 10న పోలింగ్ జరగనుండగా, ఈ నెల 23వ తేదీతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
వరంగల్-పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్-ఆకుల లలిత, ఆదిలాబాద్- దండే విఠల్, మెదక్-యాదవ్ రెడ్డి, ఖమ్మం-తాతా మధు, నల్గొండ-సి.కోటిరెడ్డి... కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎల్.రమణ, భానుప్రసాద్... మహబూబ్ నగర్ జిల్లాలో రెండు స్థానాలకు సాయిచంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి...రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలకు పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజుల అభ్యర్థిత్వం ఖరారైంది.
కాగా, ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీల స్థానాలు గల్లంతయ్యాయి. నిజామాబాద్ నుంచి మరోసారి పోటీకి విముఖత చూపిన కవితకు రాజ్యసభ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కవిత స్థానంలో ఆకుల లలితకు అవకాశం ఇచ్చారు.