Buggana Rajendranath: అసెంబ్లీలో సీఆర్డీయే రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన

Buggana introduces CRDA Cancellation Withdrawal Bill in AP assembly
  • మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ
  • అసెంబ్లీలో సీఆర్డీయే రద్దు ఉపసంహరణ బిల్లు
  • శివరామకృష్ణన్ కమిటీ అంశాలను ప్రస్తావించిన బుగ్గన
  • కోస్తా వెనుకబడిన ప్రాంతం అని చెప్పలేదని వెల్లడి
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం, గతంలో సీఆర్డీయేని రద్దు చేయడంపైనా కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్డీయే రద్దు ఉపసంహరణ బిల్లును ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ మధ్యాహ్నం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన ప్రాంతాలుగా ఉత్తరాంధ్ర, రాయలసీమలను కమిటీ గుర్తించిందని వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్ రాజధానిగా కలిగిన తెలంగాణ అభివృద్ధిలో ఒక మెట్టు పైనే ఉందని అన్నారు. ఏపీలో కోస్తా ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతం అని కమిటీ చెప్పలేదని స్పష్టం చేశారు.

అయితే అమరావతి సారవంతమైన, ఖరీదైన భూమి అని, దాన్ని వృథా చేయవద్దని మాత్రమే కమిటీ చెప్పిందని వివరించారు. నిర్దిష్టంగా ఫలానా చోట రాజధాని అని శివరామకృష్ణన్ పేర్కొనలేదని స్పష్టం చేశారు. పాలనా వ్యవహారాలు అన్ని ప్రాంతాలకు సమాన రీతిలో ఉండాలని పేర్కొన్నారని వివరించారు.

కాగా, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో సీఆర్డీయే చట్టం మళ్లీ అమల్లోకి వచ్చినట్టయింది. అదే సమయంలో సీఆర్డీయే బదులు ఏర్పాటు చేసిన మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీ (ఏఎం ఆర్డీయే) కూడా రద్దు కానుంది. గతంలో ఏఎంఆర్డీయేకి బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్డీయేకి బదలాయిస్తున్నట్టు నేటి బిల్లులో పేర్కొన్నారు.
Buggana Rajendranath
CRDA Bill
Cancellation
Withdrawal Bill
AP Assembly
YSRCP

More Telugu News