Nara Lokesh: తుగ్లక్ 3.0 మారాలని అనుకోవడం అత్యాశే: నారా లోకేశ్
- అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారు
- మూడు రాజధానులు చేయాలని ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని జగన్ చెప్పడం హైలైట్
- మురుగు బుర్రలకు మెరుగైన ఆలోచనలు రావడం జరగని పని
రాజధాని వికేంద్రీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దాని స్థానంలో మరో బిల్లును తీసుకురాబోతున్నట్టు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మూడు రాజధానుల బిల్లులోని ప్రభుత్వ ఉద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, న్యాయపరంగా, చట్టపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లును మరింత మెరుగుపరిచేందుకు, బిల్లులో ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని పొందుపరిచేందుకే ప్రస్తుత బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు.
తుగ్లక్ 3.0, మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశేనని లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని మండిపడ్డారు. ఇల్లు ఇక్కడే కట్టుకున్నా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి... మూడు రాజధానులు చేయమని ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని చెప్పడం హైలైట్ అని ఎద్దేవా చేశారు. మురుగు బుర్రలకు మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జగన్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు.