Andhra Pradesh: సోమశిల డ్యామ్ తెగుతుందన్న కథనాలపై నెల్లూరు జాయింట్ కలెక్టర్ స్పందన
- తెగిపోతుందంటూ కథనాలు
- ఊళ్లను ఖాళీ చేసేందుకు సిద్ధమైన జనాలు
- అవన్నీ వదంతులేనన్న జాయింట్ కలెక్టర్
- సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
భారీ వర్షాలు ఏపీని ఎంత అతలాకుతలం చేస్తున్నాయో తెలిసిందే. చాలా చెరువులు గండిపడి తెగిపోయాయి. కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కట్ట తెగి చెయ్యేరు నది ఉద్ధృతంగా ప్రవహించిన సంగతి తెలిసిందే. చాలా మంది ఆ ప్రవాహంలో గల్లంతయ్యారు. ఇప్పటికీ ఊహించని ఈ వర్షం నుంచి జనాలు ఇంకా తేరుకోలేదు. అయితే, కొందరు ఆకతాయిలు సోమశిల డ్యామ్ తెగిపోతుందని పుకార్లు సృష్టించారు. అదికాస్తా వైరల్ కావడంతో జనాలు తీవ్ర ఆందోళనలకు లోనయ్యారు. కొంతమంది ఊళ్లను వదిలి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.
దీనిపై అధికారులు స్పందించారు. సోమశిల డ్యామ్ చాలా సురక్షితంగా ఉందని, అదేమీ తెగిపోదని నెల్లూరు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అవి కేవలం వదంతులేనని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎవరైనా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు ప్రకటించారు.