Chevireddy Bhaskar Reddy: వరద బాధితుల కోసం చొక్కా విప్పి రంగంలోకి దిగిన చెవిరెడ్డి... వీడియో ఇదిగో!
- భారీ వర్షాలకు చిత్తూరు జిల్లాలో వరదలు
- రాయలచెరువు ప్రాంతాలో ఏరియల్ సర్వే చేసిన చెవిరెడ్డి
- నేవీ హెలికాప్టర్ లో జిల్లాకు నిత్యావసరాలు
- స్వయంగా మోసిన చెవిరెడ్డి
- వరద బాధితులకు పంపిణీ
ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు చిత్తూరు జిల్లాలో వరదలు సంభవించడం తెలిసిందే. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వరద నీరు ఉండడంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరద ముంపు బారినపడిన గ్రామాలను నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలకు బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
ఈ నిత్యావసరాలు నేవీ హెలికాప్టర్ లో జిల్లాకు చేరుకోగా, ఆ మూటలను మోసేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి కూడా చొక్కా విప్పి మరీ రంగంలోకి దిగారు. ఎంతో ఉత్సాహంగా మూటలు మోస్తూ సహాయక చర్యలు సత్వరమే సాగేందుకు తన వంతు కృషి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకర్షిస్తోంది.
కాగా, నేవీ హెలికాప్టర్ ద్వారా వచ్చిన సరకులను తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్ కాలనీలోనూ, రాయలచెరువు, చిట్టత్తూరు, సి-కాలేపల్లి, పుల్లమనాయుడు కండ్రిగ ప్రాంతాల్లో వరద బాధితులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి నేవీ హెలికాప్టర్ లో రాయలచెరువు సమీప ప్రాంతాల్లో వరద పరిస్థితులపై ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు.