Andhra Pradesh: రాజంపేట వరదల్లో 38 మంది గల్లంతు.. ఇంకా దొరకని 13 మంది ఆచూకీ
- వారి కోసం గాలిస్తున్నామన్న మన్నూరు ఎస్సై
- 25 మంది మృతదేహాలు దొరికాయని వెల్లడి
- అన్నమయ్య డ్యామ్ తెగడంతో ముంచెత్తిన వరద
ఏపీలో కొన్ని రోజుల క్రితం వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో చూసే ఉంటాం. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాయలసీమ జిల్లాలను చిగురుటాకులా వానలు వణికించాయి. వరద ప్రవాహానికి కడప జిల్లాలోని అన్నమయ్య డ్యామ్ తెగి చెయ్యేరు ఉప్పొంగి ప్రవహించింది. రాజంపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలను ముంచేసింది. ఆ వరదల నుంచి ఇప్పటికీ జనాలు తేరుకోలేదు.
తాజాగా ఆ వరదలకు సంబంధించి మన్నూరు ఎస్సై భక్త వత్సలం అప్ డేట్ ఇచ్చారు. రాజంపేట వరదల్లో 38 మంది గల్లంతయ్యారని, 25 మంది మృతదేహాలు దొరికాయని చెప్పారు. ఇంకా 13 మంది ఆచూకీ దొరకలేదని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. వర్షాల వల్ల రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు ఇచ్చి ఆదుకోవాలని కేంద్రాన్ని సీఎం జగన్ కోరిన సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఎమ్మెల్యేలతో పాటు, ప్రతిపక్ష నేతలు పర్యటిస్తున్నారు. బాధితులకు చేదోడుగా నిలుస్తున్నారు.