Ambati Rambabu: నారా భువనేశ్వరి ప్రకటనపై అంబటి రాంబాబు స్పందన
- ఇటీవల ఏపీ అసెంబ్లీలో రగడ
- తన అర్ధాంగిని కించపరిచారన్న చంద్రబాబు
- నేడు పత్రికా ప్రకటన విడుదల చేసిన భువనేశ్వరి
- తాము ఆమెను ఏమీ అనలేదని అంబటి పునరుద్ఘాటన
ఇటీవల ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై నారా భువనేశ్వరి నేడు ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. "శ్రీమతి భువనేశ్వరి గారి ప్రకటన చూశాను... పదవి కోసం బాబు ఎంతకైనా దిగజారతాడని తెలుసు కానీ... భార్యను కూడా బజారుకు లాగుతాడని మాత్రం అనుకోలేదు" అని వ్యాఖ్యానించారు.
"చంద్రబాబు అర్ధాంగి, మహానుభావుడు ఎన్టీఆర్ గారి కుమార్తె అయిన భువనేశ్వరి దేవి గారూ... మీకు నమస్కరించి చెబుతున్నాం. మేం మిమ్నల్ని ఏమీ అనలేదు. అలా అనేటువంటి స్వభావం కూడా కాదు. చంద్రబాబు మీ నాన్న గారిని అడ్డంపెట్టుకుని రాజకీయాల్లో ఎదిగి, మీ నాన్న గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఇవాళ మిమ్మల్ని కూడా అడ్డంపెట్టుకుని, మీ పేరును వాడుకుంటూ సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది నీచమైన ఎత్తుగడ" అని వ్యాఖ్యానించారు.
"చంద్రబాబునాయుడు ఏడ్చాడా... ఎవరైనా నమ్మారా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేకమంది కుటుంబాలను ఏడ్పించిన వ్యక్తి చంద్రబాబు. ఆయన ఏడవడం ఏంటి? ఆయన ఏడవడం ఒక అద్భుతమైన నటన. మరోసారి మీడియా ద్వారా నేరుగా చెబుతున్నాం... భువనేశ్వరి గారూ... మిమ్మల్ని మా పార్టీ వాళ్లు ఎవరూ ఏమీ అనలేదు. మిమ్మల్ని అన్నట్టుగా చిత్రీకరించి, సానుభూతి సంపాదించి రాజకీయ లబ్ది పొందాలన్న ప్రయత్నంలో ఇదొక భాగం. అంతేతప్ప ఇందులో వాస్తవంలేదు" అని స్పష్టం చేశారు.