Balakrishna: అఖండ గురించి ఎక్కువగా చెప్పను... మీరే చూస్తారు: బాలకృష్ణ
- హైదరాబాదులో అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్
- శిల్పకళా వేదికలో కార్యక్రమం
- ముఖ్య అతిథిగా అల్లు అర్జున్
- చివరిగా ప్రసంగించిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ తాను నటించిన అఖండ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా తనకు అలవాటైన రీతిలో శ్లోకాలు, బీజాక్షరాలు, నవ విధాన పూజలను అలవోకగా పఠించారు. ఈ క్రమంలో తనపై తానే జోక్ విసురుకున్నారు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో షో చేస్తున్నానని, ఇదే విధంగా భవిష్యత్తులో ఓ భక్తి చానల్లో ప్రవచనాల తరహాలో ఓ షో చేస్తానని చమత్కరించారు.
ఇక అఖండ చిత్రం గురించి తాను ఎక్కువగా చెప్పనని, ఎలా ఉంటుందో మీరు చూస్తారని పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పవారని, తమ్ముడు అల్లు అర్జున్ ఇంతకుముందే తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకతను వివరించారని వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆశీర్వదిస్తారని బాలకృష్ణ పేర్కొన్నారు. నటుడు ఏ పాత్ర అయినా చేస్తాడని, నటన అంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమేనని, శ్రీకాంత్ అలవోకగా నటించారని కొనియాడారు.
నటులు నిత్యావసర వస్తువుల్లాంటి వాళ్లని, వాళ్లు ఎప్పుడూ ప్రజలకు కనిపిస్తుండాలని అన్నారు. అయితే కరోనా వల్ల విరామం వచ్చిందని, మళ్లీ ప్రజల ముందుకు వచ్చామని వెల్లడించారు. తన అఖండ చిత్రాన్ని మాత్రమే కాకుండా అల్లు అర్జున్ నటించిన పుష్ప, చిరంజీవి నటించిన ఆచార్య, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కూడా ఆదరించాలని బాలయ్య తెలుగు రాష్ట్రాల ప్రజలకు పిలుపునిచ్చారు.
త్వరలోనే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నానని, ఏ సినిమాకైనా తాను కష్టపడే విధానంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు.