Arvind Kejriwal: 'మిస్టర్ పీఎం నరేంద్ర మోదీ గారు.. దయచేసి వినండి' అంటూ ఒమిక్రాన్‌పై కేజ్రీవాల్ ట్వీట్
- అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపేయాలి
- ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది
- ఈ విషయంలో ఆలస్యం చేయకూడదు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందిన అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. మిస్టర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారూ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపేయాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని ఆయన గుర్తు చేశారు.
ఈ విషయంలో ఆలస్యం చేయకుండా అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని చెప్పారు. దక్షిణాఫ్రికా సహా ఒమిక్రాన్ కేసులు ఉన్న దేశాల నుంచి ఇప్పటికే అనేక దేశాలు విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, మరి భారత్ ఎందుకు ఆలస్యం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. కరోనా మొదటి దశ విజృంభణ సమయంలో కూడా విమానాల రాకపోకలపై నిషేధం విధింపులో ఆలస్యం చేశామని ఆయన చెప్పారు.
అంతర్జాతీయ విమానాల్లో అధిక శాతం ఢిల్లీలో దిగడం వల్ల ఢిల్లీ నగరం ఆ వైరస్ వల్ల ఎక్కువగా ప్రభావితమవుతోందని ఆయన చెప్పారు. పీఎం సారు దయచేసి విమానాల రాకపోకలను ఆపాలని ఆయన ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.