Kuna Ravi Kumar: 46 లక్షల మంది పేదల నుంచి రూ. 4,800 కోట్లను కొల్లగొట్టేందుకు జగన్ ప్లాన్ వేశారు: కూన రవికుమార్
- 'జగనన్న శాశ్వత గృహ హక్కు' పథకం పేరుతో పేదలను మోసం చేస్తున్నారు
- పేదలకు వారి ఇళ్లను వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదు
- జగన్ కు ఉద్వాసన పలికేందుకు 46 లక్షల కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. పేదలను కూడా జగన్ వదలడం లేదని అన్నారు. 'జగనన్న శాశ్వత గృహ హక్కు' పథకం పేరుతో పేదలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు వారి ఇళ్లను వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని అన్నారు. ఈ పథకం కింద 46 లక్షల మంది పేదల నుంచి రూ. 4,800 కోట్లను రాబట్టేందుకు ముఖ్యమంత్రి మాస్టర్ ప్లాన్ వేశారని చెప్పారు.
వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరు మీద పేదలను జగన్ ప్రభుత్వం ఒత్తిడికి గురి చేస్తోందని కూన రవికుమార్ మండిపడ్డారు. డ్వాక్రా మహిళల సొమ్మును లాక్కుంటామని, పెన్షన్లను నిలిపివేస్తామని నోటీసులు కూడా ఇస్తోందని అన్నారు. 2024 ఎన్నికల్లో జగన్ కు ఉద్వాసన పలికేందుకు 46 లక్షల పేద కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మాట తప్పితే ప్రాణం తీయాలంటూ గతంలో అసెంబ్లీ చెప్పిన జగన్ ను ఇప్పుడేమనాలని అన్నారు. పేదలకు నోటీసులు ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తోందని చెప్పారు.