Sharmila: మీ డ్రామాలకు ఇప్పటికే 10 మంది రైతుల గుండెలు ఆగిపోయాయి: షర్మిల
- వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు
- ఎప్పుడుకొంటారో తెలియక కుప్పల మీదే రైతులు చనిపోతున్నారు
- యాసంగి వడ్ల మీద రాజకీయాలు వద్దు
- ఇంకెంత మంది చస్తే మీ కండ్లు చల్లబడుతాయి కేసీఆర్ గారు?
ధాన్యం విక్రయించడానికి వెళ్లి కొనుగోలు కేంద్రాల వద్దే పలువురు రైతులు తనువు చాలించారంటూ పలు దినపత్రికల్లో వచ్చిన వార్తలను పోస్ట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల విమర్శలు గుప్పించారు.
'వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని ఎప్పుడుకొంటారో తెలియక కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతుంటే, యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారు. మీ డ్రామాలకు ఇప్పటికే 10 మంది రైతుల గుండెలు ఆగిపోయాయి. ఇవాళ మరో ఇద్దరు..ఇంకెంత మంది రైతులు చస్తే మీ కండ్లు చల్లబడుతాయి కేసీఆర్ గారు?' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
'ఇంకెంత మందిని బలితీసుకొంటారు? రైతులను కోటీశ్వర్లను చేశాం, కార్లల్లో తిరుగుతున్నారు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఒక్కసారి ఫామ్ హౌస్ మత్తు నుంచి బయటికి వస్తే తెలుస్తుంది.. రైతులు కోటీశ్వరులు కావడం కాదు మీరు ఉరి కొయ్యకు ఉరి వేస్తున్నారని. మీరు పంట కొనక కాటికి పంపుతున్నారు' అని షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు.