Laxmi Narayana: రైతుల పాదయాత్రపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- 35వ రోజు పాదయాత్రను ప్రారంభించిన లక్ష్మీనారాయణ
- రైతుల పోరాటం రాష్ట్ర ప్రయోజనాల కోసం
- రాజధాని ఒకే చోట ఉంటే పెట్టుబడులు వస్తాయి
- పెట్టుబడులు వస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి
అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలిపిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేటి యాత్రను ప్రారంభించారు. నెల్లూరు జిల్లా పుట్టంరాజుకండ్రిగలో 35వ రోజు పాదయాత్రను ప్రారంభించిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. రైతులు చేపట్టిన మహాపాదయాత్ర వారి కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే వారు ఈ పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు.
కొందరు ఆరోపిస్తున్నట్టుగా రైతులు వారి స్వప్రయోజనాల కోసం ఈ యాత్ర చేపట్టలేదని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ఒకేచోట ఉండడం వలన పెట్టుబడులు వస్తాయన్నారు. అవి వస్తేనే ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. ప్రభుత్వాలు మారొచ్చు కానీ, వాటి విధానాలు మాత్రం మారకూడదని అన్నారు. కాగా, నేటి రైతుల పాదయాత్ర 15 కిలోమీటర్ల మేర సాగి వెంగమాంబపురంలో ముగుస్తుంది.