Telangana: ఫిబ్రవరి నాటికి ఒమిక్రాన్ తీవ్రం.. అప్రమత్తంగా ఉండండి: తెలంగాణ ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు

corona cases will increase after january 15 said Telangana govt

  • జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం
  • లాక్‌డౌన్‌లు సమస్యకు పరిష్కారం కాదు
  • ఒమిక్రాన్ వల్ల ఇప్పటి వరకు ఎక్కడా మరణాలు నమోదు కాలేదు
  • కొవిడ్ కంటే తప్పుడు కథనాల వల్లే ఎక్కువ ప్రమాదం

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు కీలక సూచన చేశారు. జనవరి 15 తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని, ఫిబ్రవరి నాటికి అవి మరింత తీవ్రతరమయ్యే అవకాశాన్ని కొట్టి పడేయలేమని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులందరూ కరోనా టీకా వేయించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. ఇలాంటి స్వీయ జాగ్రత్తలతోనే థర్డ్ వేవ్ నుంచి బయటపడగలమని అన్నారు.

లాక్‌డౌన్‌లు సమస్యకు పరిష్కారం కాదు కాబట్టి రానున్న రోజుల్లో అవి ఉండే అవకాశం లేదన్నారు. ఈ నెలలో 1.03 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తులకు తీవ్ర ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, ఇది ఊరటనిచ్చే అంశమే అయినా అప్రమత్తంగా ఉండాల్సిందేనని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. వైరస్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో బాధితులు ఆసుపత్రుల్లో చేరడం, మరణాలు సంభవించడం వంటివి నమోదు కాలేదని తెలిపారు.

ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించిందని, తెలంగాణలోనూ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నెల 1 నుంచి రాష్ట్రానికి వచ్చిన 900 మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. వీరిలో 13 మందికి మాత్రమే కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని, దీంతో వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని వివరించారు. కొవిడ్ కంటే తప్పుడు కథనాలే ఎక్కువ ప్రమాదకరమని, దయచేసి అలాంటి కథనాలను ప్రచారం చేసి ఆరోగ్యశాఖ మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని డాక్టర్ శ్రీనివాస్ కోరారు.

  • Loading...

More Telugu News