Kamal Haasan: కరోనా నయమైన వెంటనే బిగ్ బాస్ షోలో పాల్గొన్న కమలహాసన్... ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం
- గత నెల 22న కమల్ కు కరోనా పాజిటివ్
- చెన్నైలో ఓ ఆసుపత్రిలో చికిత్స
- డిసెంబరు 4న డిశ్చార్జి
- వెంటనే బిగ్ బాస్ షోలో పాల్గొన్న కమల్
- నోటీసులు పంపనున్న సర్కారు
ఇటీవల కరోనా బారినపడిన ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమలహాసన్ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే, ఇంటికి వచ్చిన ఆయన తాను హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనిపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా నుంచి కోలుకున్న వెంటనే బహిరంగ ప్రదేశాలకు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కమల్ తన చర్యలపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఆరోగ్య శాఖ నోటీసులు జారీ జారీ చేసేందుకు సిద్ధమైంది. ఇది కరోనా మార్గదర్శకాల ఉల్లంఘనే అని, బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రముఖులే ఇలా ప్రవర్తిస్తే ఎలా? అంటూ అసహనం వెలిబుచ్చింది.
గత నెల 22న కమల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆపై ఆసుపత్రిలో చేరిన ఆయన డిసెంబరు 4న డిశ్చార్జి అయ్యారు. అయితే ఆయన బిగ్ బాస్ షోకి వెళ్లడంపై ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వ నియమావళి ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వారు తప్పనిసరిగా ఏడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలి. ఈ విషయంలో కమల్ నిబంధనలు ఉల్లంఘించారని తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ జే.రాధాకృష్ణన్ పేర్కొన్నారు.