Corona Virus: ఏపీలో మరోసారి కరోనా ఆంక్షలు.. మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కారు
- బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా
- మాస్క్ లేని వారిని దుకాణాలకు రానిస్తే భారీగా ఫైన్
- వాట్సప్ ద్వారా 80109 68295 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు
ఏపీలో మరోసారి కరోనా ఆంక్షలు అమలు చేస్తూ సర్కారు మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర సర్కారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తారు.
అంతేకాదు, మాస్క్ లేని వారిని దుకాణాలకు రానిచ్చే యాజమాన్యాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల మధ్య జరిమానా వేస్తారు. అలాగే, రెండు రోజుల పాటు ఆయా వాణిజ్య, వ్యాపార సంస్థలను మూసివేయాల్సి ఉంటుంది. కరోనా నిబంధనల ఉల్లంఘనలపై వాట్సప్ ద్వారా 80109 68295 నంబరుకు ప్రజలు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వం వెల్లడించిన మార్గదర్శకాలను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు అమలు చేయాల్సి ఉంటుంది.