Sajjala Ramakrishna Reddy: ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ ప్రకటనలు చేయడం ఏంటి?: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
- పీఆర్సీ సహా 71 డిమాండ్ల సాధనకు ఉద్యోగుల ఉద్యమం
- నిరసనలు కొనసాగుతాయన్న ఉద్యోగ సంఘాల నేతలు
- ఇలాంటి వ్యాఖ్యలతో ఉద్యోగులకే నష్టమన్న సజ్జల
- హామీలను తప్పకుండా అమలు చేస్తామని వెల్లడి
పీఆర్సీ సహా 71 డిమాండ్ల సాధన కోసం ఏపీ ఉద్యోగులు నిరసన బాట పట్టడం తెలిసిందే. పీఆర్సీ సహా ప్రతి ఒక్క డిమాండ్ పరిష్కరించేంత వరకు ఉద్యమం ఆపేది లేదని ఉద్యోగ సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారంటూ అసహనం ప్రదర్శించారు. హెచ్చరికలు తమపై ప్రభావం చూపుతాయని భావించడంలేదని వ్యాఖ్యానించారు.
ఇలాంటి వ్యాఖ్యలతో ఉద్యోగులకే నష్టమని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సజ్జల తెలిపారు. మరో వారంలో పీఆర్సీ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. సీపీఎస్ రద్దు అంశంపై కమిటీలు ఏర్పాటు చేశామని, నెలరోజుల్లో అధ్యయనం పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల విషయంలో వెనుకంజ వేసేది లేదని స్పష్టం చేశారు.