Madanapalle: మదనపల్లె మార్కెట్లో రికార్డు.. కిలో మునగకాయలు రూ. 600
- సైజును బట్టి కిలోకు 12 నుంచి 18 కాయలు
- ఒక్కో మునగకాయ ధర రూ. 30 పైనే
- వర్షాల వల్ల పంట దెబ్బతినడమే కారణమంటున్న వ్యాపారులు
కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పడానికి ఇది ఉదాహరణ. చిత్తూరు జిల్లా మదనపల్లె కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో మునగకాయల ధర పలికింది. కిలో ఏకంగా రూ. 600 ధర పలకడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మునగకాయల సైజును బట్టి కిలోకు 12 నుంచి 18 తూగుతాయి. ఈ లెక్కన ఒక్కో మునగకాయ రూ. 30కి పైనే పలికినట్టు. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా మునగ పంట దెబ్బతినడం వల్లే ధర పెరిగినట్టు రైతులు చెబుతున్నారు.
మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని మునగచెట్లు వర్షాలకు పూర్తిగా దెబ్బతినడంతో తమిళనాడు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. మిగతా కూరగాయల ధరలు కూడా ఇక్కడ కిలో రూ. 80 నుంచి రూ. 150 మధ్య పలుకుతున్నాయి.