Rahul Dravid: అదంతా ద్రవిడ్ చలవే: టీమిండియా టెస్ట్ ఓపెనర్ మయాంక్
- మానసికంగా, సాంకేతికంగా సిద్ధం చేశాడని వెల్లడి
- వర్తమానంపై దృష్టి పెట్టాలంటూ సూచనలు
- భావోద్వేగాల నియంత్రణలో సాయం
దాదాపు ఏడాది తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ న్యూజిలాండ్ తో రెండో టెస్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 62 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డునూ అందుకున్నాడు. ఆ దెబ్బకు ఒక్కసారిగా అతడు టెస్ట్ ర్యాంకింగ్స్ లో 11వ స్థానానికి ఎగబాకేశాడు. అయితే, తన సెంచరీ దాహాన్ని తీర్చడంలో తన ఆలోచనా విధానాలను మార్చింది మాత్రం కోచ్ రాహుల్ ద్రవిడేనని మయాంక్ చెప్పాడు. తన సక్సెస్ అతడి చలవేనన్నాడు.
భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ‘వర్తమానం’పై దృష్టి పెట్టాలంటూ ద్రవిడ్ చేసిన సూచనలే తాను బాగా ఆడేలా ప్రేరేపించాయని చెప్పుకొచ్చాడు. తన ఆటలో సాంకేతిక అంశాలతో పాటు తనను మానసికంగా దృఢం చేశాడని చెప్పాడు. ఆలోచనలు, మానసిక శక్తిని ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలంటూ సూచించాడని తెలిపాడు. గతంలో వాడిన టెక్నాలజీనే నమ్మాలని, పరుగులు వాటంతట అవే వస్తాయంటూ స్ఫూర్తి నింపాడని చెప్పాడు. ఆయన మాటల ఫలితంగా తర్వాత మ్యాచ్ లోనే తాను చెలరేగానని వివరించాడు.