varanasi: వారణాసిలో మోదీపై పూల వర్షం కురిపించిన ప్రజలు.. వీడియో ఇదిగో
- కలల ప్రాజెక్ట్ కాశీ విశ్వనాథ్ ధామ్ వద్దకు మోదీ
- ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న ప్రధాని
- కాశీ గంగా నదిలో మోదీ పుణ్యస్నానం
- పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటిస్తున్నారు. తన కలల ప్రాజెక్ట్ కాశీ విశ్వనాథ్ ధామ్‌ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. దీంతో వారణాసిలో పండుగ వాతావరణం నెలకొంది. ఢిల్లీ నుంచి వారణాసికి చేరుకున్న మోదీకి స్వాగతం పలుకుతూ అక్కడి ప్రజలు ఆయనపై పూల వర్షం కురిపించారు.
అనంతరం కాశీ గంగా నదిలో మోదీ పుణ్యస్నానం ఆచరించారు. గంగా నదిలో కలశంతో పుష్పాలు వదిలారు. కాశీ విశ్వనాథ్ ధామ్ తోపాటు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరపనున్నారు. ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన పర్యటన, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా వారణాసిలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
కాగా, 1669లో అహల్యాబాయి హోల్కర్ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించగా, దాదాపు 350 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ విస్తరణ, పునరుద్ధరణ కోసం 2019 మార్చి 8న ఆలయ కారిడార్‌కు శంకుస్థాపన చేసిన విషయం తెలసిందే. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి.
ఈ కారిడార్‌ను 50 వేల చదరపు మీటర్లలో నిర్మించారు. ప్రధాన ప్రవేశ మార్గం గంగానది వైపు లలితా ఘాట్ నుంచి ఉంటుంది. ఈ కారిడార్‌ను మొత్తం 3 భాగాలుగా విభజించారు. ఈ కారిడార్‌లో 24 భవనాలనూ నిర్మించారు.