Vladimir Putin: బతుకుదెరువు కోసం ఒకప్పుడు ట్యాక్సీ కూడా నడిపాను: రష్యా అధ్యక్షుడు పుతిన్
- నాడు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం
- ఆ సమయంలో కేజీబీ ఏజెంట్ గా ఉన్న వ్లాదిమిర్ పుతిన్
- అదనపు డబ్బు కోసం ప్రైవేట్ డ్రైవర్ గా చేశానని వెల్లడి
ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిపోయిన సోవియన్ యూనియన్ కాలగమనంలో పతనమైంది. అగ్రరాజ్యం అమెరికాతో అన్ని రంగాల్లో పోటీపడిన సోవియట్ యూనియన్... తప్పనిసరి పరిస్థితుల్లో విచ్ఛిన్నమైంది. ఆ ప్రభావం నుంచి కోలుకోవడానికి సోవియట్ దేశాలకు చాన్నాళ్లు పట్టింది. అక్కడి ప్రజల జీవనప్రమాణాలు పడిపోయాయి. అందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యక్ష సాక్షి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆనాటి పరిస్థితులను వివరించారు. సోవియట్ యూనియన్ సమయంలో పుతిన్ కేజీబీ గూఢచారిగా పనిచేశారు. అయితే, సోవియట్ యూనియన్ పతనం తర్వాత తన పరిస్థితి దిగజారిందని వెల్లడించారు. ఆదాయం కోసం ట్యాక్సీ కూడా నడిపానని తెలిపారు. సోవియట్ యూనియన్ బీటలు వారడం తనపైనే కాకుండా, అనేక లక్షల మందిపై ప్రభావం చూపిందని పేర్కొన్నారు.
తాను కూడా బతుకుదెరువు కోసం అనేక పనుల్లో భాగంగా క్యాబ్ నడిపానని, దాని గురించి ఇప్పుడు చెప్పాల్సి రావడం బాధాకరమైన విషయం అని పుతిన్ తెలిపారు. "కొన్నిసార్లు అదనంగా కొంత డబ్బు కావాల్సి వచ్చేది. దాంతో ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేయక తప్పలేదు. విచారించాల్సిన విషయమే అయినా, జరిగిన దాన్ని చెప్పుకోవడంలో తప్పులేదు. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ కుప్పకూలిపోవడంతో 'చారిత్రక రష్యా' స్వప్నం భగ్నమైంది" అని వివరించారు.