SIT: లఖింపూర్ ఖేరి ఘటన పక్కా ప్రణాళికతో జరిగింది: కోర్టుకు వెల్లడించిన సిట్
- దేశంలో సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి ఘటన
- నిరసనలు తెలుపుతున్న రైతులు
- రైతులపైకి దూసుకెళ్లిన వాహనం
- నలుగురు రైతులు సహా 8 మంది మృతి
- కేంద్రమంత్రి తనయుడిపై ఆరోపణలు
- కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
ఆమధ్య ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఓ ఎస్ యూవీ వాహనం దూసుకుపోగా, నలుగురు రైతులు సహా ఎనిమిదిమంది మృత్యువాతపడడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రానే వాహనంతో రైతులపైకి దూసుకెళ్లాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నేడు వివరాలను కోర్టుకు లేఖ ద్వారా సమర్పించింది.
రైతులను చంపాలన్న పక్కా ప్రణాళికతోనే వాహనం నడిపారని సిట్ తన లేఖలో పేర్కొంది. ఇదేమీ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఘటన కాదని, రైతులను చంపేందుకు కుట్ర పన్నారని వివరించింది. కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా సహా 13 మంది నిందితులపై హత్యాయత్నం అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. గతంలో నిందితులపై దురుసుగా వాహనం నడిపారన్న అభియోగాలు నమోదు కాగా, వాటిని సవరించేందుకు వీలు కల్పించాలని సిట్ విజ్ఞప్తి చేసింది.
గత అక్టోబరు 3న లఖింపూర్ ఖేరిలో జరిగిన ఈ ఘటనలో నలుగురు రైతులు, మరో నలుగురు ఇతరులు మరణించారు.