Balakrishna: 'అఖండ' ఇండస్ట్రీకి ఊపిరిపోసినట్టనిపించింది: తిరుమలలో బాలకృష్ణ
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'అఖండ' యూనిట్
- సినిమా విజయవంతం కావడం సంతోషంగా ఉందన్న బాలయ్య
- కరోనా సమయంలో టైమ్ సెన్స్ తో సినిమాను విడుదల చేశామని వ్యాఖ్య
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సభ్యులు పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తున్నారు. ఈరోజు వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనంలో వారు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో బాలయ్యకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలను అందించారు.
శ్రీవారి దర్శనానంతరం ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన తర్వాత మీడియాతో బాలయ్య మాట్లాడుతూ, సినిమాకు ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత సినిమాను విడుదల చేశామని, ఈ చిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. సినిమా కోసం అందరం ఎవరి వంతు కృషి వారు చేశామని... ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల్లో టైమ్ సెన్స్ తో సినిమాను విడుదల చేశామని తెలిపారు. ఈ సినిమా విజయం సినీ పరిశ్రమకు ఊపిరిపోసినట్టనిపించిందని అన్నారు.