TDP: టీడీపీ సోషల్ మీడియా సమన్వయకర్త అరెస్టుకు సీఐడీ యత్నం... అడ్డుకున్న గోరంట్ల బుచ్చయ్య, టీడీపీ నేతలు
- రాజమండ్రిలో అరెస్ట్ కలకలం
- టీడీపీ సమన్వయకర్త సంతోష్ అరెస్ట్ కు ప్రయత్నం
- నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారన్న గోరంట్ల
- ప్రభుత్వం కక్ష సాధిస్తోందంటూ ఆగ్రహం
టీడీపీ సోషల్ మీడియా విభాగం సమన్వయకర్త సంతోష్ ను రాజమండ్రిలో అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు యత్నించారు. ఓ సోషల్ మీడియా పోస్టు విషయంలో సంతోష్ ను అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు రాజమండ్రి వచ్చారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారుల ప్రయత్నాలను టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీ నేతలు అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా సంతోష్ ను ఎలా అరెస్ట్ చేస్తారని వారు సీఐడీ అధికారులను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి గోరంట్ల స్పందిస్తూ, సోషల్ మీడియా పోస్టుల అంశంలో కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం సంతోష్ భార్య నిండు గర్భవతి అని, ఆమె ఆసుపత్రిలో ఉందని వెల్లడించారు. ఇలాంటి సమయంలో సంతోష్ ను అరెస్ట్ చేయాలని చూడడం కక్షపూరిత వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
సంతోష్ ను అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు ఆసుపత్రి వద్దకు రాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసుపత్రి వద్దే కుర్చీ వేసుకుని బైఠాయించారు. ఓవైపు సుప్రీంకోర్టు సోషల్ మీడియా పోస్టుల విషయంలో కేసులు ఉండవు అని చెబుతుంటే రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా జగన్ నాయకత్వంలో కొత్త రాజ్యాంగ విధానాలు అమలు చేస్తున్నారని గోరంట్ల ట్వీట్ చేశారు.