Dharmapuri Srinivas: కాంగ్రెస్ పార్టీలోకి డీఎస్ పునరాగమనం... రేపు అధికారిక ప్రకటన!
- ఈ ఉదయం సోనియాతో చర్చలు
- 40 నిమిషాలకు పైగా భేటీ
- రేపు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన చేస్తుందన్న భట్టి
- అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళుతున్నట్టు వెల్లడి
రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి పునరాగమనం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఉదయం డీఎస్ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చలు జరిపారు. దాదాపు 40 నిమిషాలకు పైగా ఈ భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీలో డీఎస్ చేరిక దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది.
దీనిపై రేపు ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. అధిష్ఠానం పిలుపుమేరకు భట్టి కూడా ఢిల్లీ వెళుతున్నారు. పార్టీ వ్యవహారాలపై మాట్లాడడానికి హస్తిన వెళుతున్నట్టు ఆయన వెల్లడించారు.
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డి.శ్రీనివాస్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అన్న విషయం తెలిసిందే. వైఎస్ క్యాబినెట్లో మంత్రిగానూ వ్యవహరించారు. అయితే 2009 ఎన్నికల్లో డీఎస్ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అవకాశం ఇచ్చింది.
కాగా, డీఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నేత కాగా, ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అరవింద్ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి క్రమంగా డీఎస్ కు, టీఆర్ఎస్ కు మధ్య దూరం పెరిగింది. త్వరలోనే రాజ్యసభ్యుడిగా డీఎస్ పదవీకాలం ముగియనుంది.