omicron: తెలంగాణ‌లో 8కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. క‌రోనా థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్న స‌ర్కారు

8 omicron cases in ts

  • రాష్ట్రంలో ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి జరగలేదు
  • భ‌విష్య‌త్తులో మ‌రో 10 కొత్త వేరియంట్లు వ‌చ్చే అవ‌కాశం
  • లాక్‌డౌన్ పెడ‌తార‌న్న దుష్ప్ర‌చారాలను న‌మ్మ‌కూడ‌దు
  • ర్యాండ‌మ్‌గా ఒమిక్రాన్ ప‌రీక్ష‌లు చేస్తున్నాం

తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి చేరిందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే, రాష్ట్రంలో ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఒమిక్రాన్ కేసుల గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని, ప్ర‌జ‌లు అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆయ‌న సూచించారు.

ప్ర‌పంచంలో ఇప్ప‌టివ‌ర‌కు ఒమిక్రాన్ వ‌ల్ల ఒక్క మ‌ర‌ణ‌మే సంభ‌వించింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. తెలంగాణ‌లో క‌రోనా మూడో ద‌శ విజృంభ‌ణ‌ ఎదురైతే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ఆయ‌న చెప్పారు. భ‌విష్య‌త్తులో మ‌రో 10 కొత్త క‌రోనా వేరియంట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

ప్ర‌జ‌లు వ్యాక్సిన్లు తీసుకోక‌పోవ‌డ‌మే ఒమిక్రాన్ వ్యాప్తికి కార‌ణ‌మ‌ని ఆయ‌న చెప్పారు. ఒమిక్రాన్‌ను క‌రోనా నుంచి ప్ర‌త్యేకంగా చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని, ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఇంట్లో, బ‌య‌ట మాస్కులు ధ‌రించాల‌ని ఆయ‌న చెప్పారు.

లాక్‌డౌన్ పెడ‌తార‌న్న దుష్ప్ర‌చారాలను ప్ర‌జ‌లు న‌మ్మ‌కూడ‌ద‌ని ఆయ‌న సూచించారు. తెలంగాణ‌లో 97 శాతం మంది ప్ర‌జ‌లు క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నార‌ని ఆయ‌న వివ‌రించారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో  100 శాతం మంది తొలి డోసు తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

అలాగే, 56 శాతం మంది రెండో డోసూ తీసుకున్న‌ట్లు వివ‌రించారు. కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒమిక్రాన్‌పై జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ర్యాండ‌మ్‌గా తాము క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని వివ‌రించారు. అందులో భాగంగానే ఒమిక్రాన్ కేసుల‌ను గుర్తించామ‌ని, దాన్ని అడ్డుకునేందుకు అన్ని ర‌కాలుగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు. రాష్ట్రంలో వెల్ల‌డైన ఎనిమిది ఒమిక్రాన్ కేసుల్లో ఏడు కేసులు నాన్ రిస్క్ దేశాల నుంచి వ‌చ్చిన వారివేన‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News