Bihar: బీహార్ నుంచి 12 ఏళ్ల క్రితం అదృశ్యం.. చనిపోయాడని భావించి కర్మకాండలు.. పాక్ జైలులో ఉన్నట్టు లేఖ!
- బీహార్లోని బక్సర్ జిల్లాలో ఘటన
- మతిస్థిమితం లేకపోవడంతో సరిహద్దు దాటి ఉంటాడని అనుమానం
- విషయం తెలిసి ఆనందంలో కుటుంబం
- కుమారుడి కోసం తల్లి ఎదురుచూపులు
పుష్కరకాలం క్రితం బీహార్ నుంచి అదృశ్యమైన వ్యక్తి ఇప్పుడు పాకిస్థాన్ జైలులో బందీగా ఉన్న విషయం తెలిసి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతడు తమను చేరుకునే క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. బీహార్లోని బక్సర్ జిల్లా ఖిలాఫత్పూర్కు చెందిన ఛావీ 12 ఏళ్ల క్రితం ఓ రోజు అకస్మాత్తుగా మాయమయ్యాడు. ఆ సమయంలో అతడి వయసు 18 సంవత్సరాలు. అంతేకాదు, అతడి మానసిక స్థితి కూడా సరిగా లేదు.
అతడి కోసం గాలించిన కుటుంబ సభ్యులు ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా గాలించి విసిగి వేసారిపోయారు. కుమారుడు తిరిగి వస్తాడని రెండేళ్లపాటు ఎదురుచూసిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. దీంతో అతడు చనిపోయాడని భావించి కర్మకాండలు నిర్వహించారు. అయితే, అతడి జ్ఞాపకాలు మాత్రం వారిని వీడిపోలేదు.
ఈ క్రమంలో తాజాగా స్పెషల్ బ్రాంచ్ నుంచి పోలీసులకు ఓ లేఖ అందింది. ఖిలాఫత్పూర్కు చెందిన ఛావీ అనే యువకుడు పాకిస్థాన్ జైలులో ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. దీంతో ఆ లేఖ పట్టుకుని ఖిలాఫత్పూర్ చేరుకున్న పోలీసులు అతడి తల్లిదండ్రుల కోసం ఆరా తీశారు. చివరికి అతడి కుటుంబ సభ్యులను కలిసి విషయం చెప్పడంతో వారు సంతోషం పట్టలేకపోయారు. చనిపోయాడనుకున్న కుమారుడు బతికే ఉన్నాడని తెలియడంతో ఆ కుటుంబంలో ఆనందం నిండుకుంది.
ఛావీ పాక్ జైలులో బందీగా ఉన్నట్టు లేఖలో పేర్కొన్నప్పటికీ అతడు ఎక్కడ ఉన్నాడన్న కచ్చితమైన సమాచారం లేదని పోలీసులు తెలిపారు. అతడిని వీలైనంత త్వరగా భారత్ రప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. మతిస్థిమితం లేకపోవడం వల్ల ఛావీ సరిహద్దు దాటి పాక్ బలగాలకు చిక్కి ఉంటాడని భావిస్తున్నారు. కాగా, కుమారుడు అదృశ్యమైన కొన్నేళ్లకే ఛావి తండ్రి కన్నుమూశాడు.