Maharashtra: కోతులు-కుక్కల మధ్య ‘గ్యాంగ్‌వార్’.. 250 కుక్క పిల్లల్ని చంపేసిన మర్కటాలు
- కొన్ని రోజుల క్రితం కోతి పిల్లను వెంటాడి చంపిన కుక్కలు
- అప్పటి నుంచి పగతో రగిలిపోతున్న మర్కటాలు
- కుక్కపిల్లల్ని ఎత్తుకెళ్లి భవనం పైనుంచి పడేసి చంపేస్తున్న వైనం
- భయంతో వణికిపోతున్న గ్రామస్థులు
కోతులకు, కుక్కలకు మధ్య జరిగిన ‘గ్యాంగ్‌వార్’లో మర్కటాలదే పైచేయి అయింది. అంతేకాదు, రెచ్చిపోయిన కోతులు దారుణంగా ప్రవర్తించాయి. నెల రోజుల వ్యవధిలో 250కిపైగా కుక్కపిల్లలను చంపేసి పగ తీర్చుకున్నాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మాజల్‌గావ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.
కుక్కపిల్ల కనిపిస్తే చాలు ఎత్తుకుపోయి భవనం పైనుంచో, చెట్ల పైనుంచో అమాంతం కిందపడేసి వాటిని చంపేశాయి. మర్కటాల పగ చూసిన స్థానికులు భయంతో వణికిపోతున్నారు. తాము పెంచుకుంటున్న కుక్కపిల్లల్ని బయటకు వదలకుండా జాగ్రత్త పడుతున్నారు. మర్కటాల తీరుతో గ్రామంలో ఒక్క కుక్కపిల్ల కూడా మిగలలేదని గ్రామస్థులు తెలిపారు.
అంతేకాదు, మహారాష్ట్ర సరిహద్దుకు ఆవల 10 కిలోమీటర్ల దూరంలోని లవూల్ గ్రామంలో ఒకే ఒక్క కుక్కపిల్ల మిగిలిందట. కొన్ని రోజుల క్రితం ఓ కోతి పిల్లను వెంటాడిన కుక్కలు దానిని చంపేశాయి. దీంతో అప్పటి నుంచి ప్రతీకారంతో రగలిపోతున్న కోతులు.. కుక్కపిల్ల కనిపిస్తే చాలు ఎత్తుకుపోయి చంపేస్తున్నాయి. అలా నెల రోజుల వ్యవధిలో 250కి పైగా కుక్కపిల్లలను చంపేశాయి. అంతేకాదు, గ్రామంలోని చిన్నపిల్లలపైనా కోతులు ప్రతాపం చూపిస్తుండడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.