USA: భారీ అగ్ని ప్రమాదం.. కిటికీలోంచి బయటకు వచ్చిన అక్కాతమ్ముళ్లు.. వీడియో ఇదిగో
- న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ విలేజ్లో ఘటన
- 14 అంతస్తుల భవనంలో భారీగా మంటలు
- భవనానికి ఆనుకుని ఉన్న పైపు సాయంతో దిగిన టీనేజర్లు
న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ విలేజ్లో ఇటీవల 14 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ మంటల్లో అప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నప్పటికీ భవనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాలేకపోతున్నారు.
ఆ అపార్ట్ మెంట్లలోని ఇళ్లు తగలబడిపోతున్నాయి. పెద్ద వారు సైతం ఇళ్ల నుంచి బయటకు ఎలా వెళ్లాలో తెలియక తీవ్ర భయాందోళనలకు గురవుతోంటే ఇద్దరు టీనేజర్లు మాత్రం ఉపాయం ఆలోచించి అపార్ట్ మెంట్ నుంచి కిందకు దిగి ప్రాణాలు కాపాడుతున్నారు. 18 ఏళ్ల అక్క, ఆమె తమ్ముడు (13) తమ భవనానికి ఆనుకుని ఉన్న పైపు సాయంతో కిందికి జారుతూ వచ్చేశారు.
తాము ఉంటోన్న ఇంటి కిటికీ తలుపు తెరిచి అందులో నుంచి బయటకు వచ్చి పైపు సాయంతో వారు కిందకు దిగుతుండగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వారి అమ్మ మాత్రం మంటల్లో చిక్కుకుపోయారు. ఆమె మరో గదిలో ఉంది. అక్కాతమ్ముళ్లు ఓ గదిలో ఉండగా వాళ్ల అమ్మ మరో గదిలో ఉండిపోయింది. ఆ గది తలుపు తీయాలని ఆ అక్కాతమ్ముడు కోరినా ఆమె తీయలేకపోయింది.
ఇక ఆమెను రక్షించే అవకాశం లేకపోవడం, మంటలు తమ గదిలోకి వచ్చేయడంతో ఆ అక్కాతమ్ముళ్లు కిటికీ తీసి పైపు ద్వారా జారుతూ కిందకు చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ అపార్ట్ మెంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.