Mohan Bhagwat: గత 40 వేల సంవత్సరాలుగా భారతీయులందరి డీఎన్ఏ ఒకటే: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
- మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- భారతీయులందరి పూర్వీకులు ఒక్కరేనని వెల్లడి
- భారత్ వికాసానికి పూర్వీకులే కారణమని వివరణ
- కేంద్రంపై తమ పెత్తనం ఏమీ లేదని స్పష్టీకరణ
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 40,000 సంవత్సరాల కిందట భారతీయుల డీఎన్ఏ ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉందని పేర్కొన్నారు. మనందరి పూర్వీకులు ఒక్కరేనని వ్యాఖ్యానించారు. పూర్వీకుల వారసత్వంగా భారతదేశం వికసించిందని, సంస్కృతి కొనసాగుతోందని వివరించారు. ఈ విషయంలో తానేమీ ఆడంబరాలు పలకడంలేదని స్పష్టం చేశారు.
అంతేకాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆర్ఎస్ఎస్ పెత్తనం ఏమీ లేదని మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. "వారికి విభిన్న కార్యనిర్వాహకులు ఉన్నారు, విభిన్న సిద్ధాంతాలు ఉన్నాయి, విభిన్నమైన విధానాలు ఉన్నాయి. సంఘ్ కు సంబంధించి ఆలోచనలు, సంస్కృతి ఎంతో శక్తిమంతమైనవి. కేంద్రంలో ఉన్న ప్రముఖులు సంఘ్ కు చెందినవారే... ఎప్పటికీ అలాగే ఉంటారు. ఆ సంబంధం అంతవరకే. అంతేతప్ప కేంద్రం రిమోట్ కంట్రోల్ సంఘ్ చేతుల్లో ఉంది, కేంద్రాన్ని సంఘ్ నియంత్రిస్తోంది అనడం సరికాదు... అది అవాస్తవం" అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.