omicron: ఒమిక్రాన్ వల్ల వచ్చే ఏడాది కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది: డబ్ల్యూహెచ్‌వో
- 2022 సంవత్సరంలో కరోనాను అంతం చేయాలి
- ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది
- పండగల వేళ ఆంక్షలు తప్పనిసరి
- ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే అదే మేలు
కరోనా కోరల్లో చిక్కుకుని ఈ ఏడాది ప్రపంచ దేశాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. డెల్టా వ్యాప్తి ముగుస్తుందనగా, ఒమిక్రాన్ పుట్టుకొచ్చి మరోసారి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జన సమూహాలు పెద్ద ఎత్తున కనపడే అవకాశం ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ శర వేగంగా వ్యాప్తి చెందుతోంది. దక్షిణాఫ్రికా, బ్రిటన్, అమెరికా దేశాలలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లోనూ దాని వ్యాప్తి ప్రారంభమైంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఒమిక్రాన్ నిర్ధారణ అవుతుండడం గమనార్హం. 2021 ముగుస్తోన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అథనామ్ జెనీవాలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రపంచ దేశాలన్నీ కలిసి 2022 సంవత్సరంలో కరోనాను అంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి కరోనా ప్రపంచంలో కలకలం సృష్టిస్తోందని ఆయన చెప్పారు.
ఇటువంటి సమయంలో పండగల వేళ ఆంక్షలు తప్పనిసరిగా విధించాలని ఆయన అన్నారు. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇతర వేరియంట్ల కంటే చాలా వేగంగా వ్యాపిస్తోందని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాల ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే పండుగలు చేసుకోకుండా ఉండడం మంచిదని ఆయన హెచ్చరించారు.
ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల ప్రజలు కరోనా తొలి డోస్ కోసం ఎదురుచూస్తున్నారని, పరిస్థితులు ఆయా దేశాల్లో అలా ఉంటే, మరోవైపు ధనిక దేశాల్లో మాత్రం మరోలా ఉందని చెప్పారు. ప్రపంచమంతా సమాంతరంగా వ్యాక్సినేషన్ జరగాలని ఆయన సూచించారు.